దక్షిణ మధ్య రైల్వే శాఖను కనికరించని కేంద్ర బడ్జెట్

SMTV Desk 2019-02-02 12:27:42  South central railway, Central government, 2019 Budget, Piyush goyel

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్ లో ఈ సారి కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖకు నిరాశే మిగిలింది. ఈ శాఖకు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకి మాత్రమె సరిపడా ఉంది. అయితే ఈ బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే శాఖకు రూ. 5,924 కోట్ల నిధుల కేటాయించినట్లు అడిషనల్ జనరల్ మేనేజర్ పుజాన్ థామస్ వెల్లడించారు. గత సంవత్సర కేటాయింపుతో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగిందన్నారు. 834 కొత్తలైన్లకు వెయ్యి కోట్లు, 905 డబ్లింగ్ కోసం రూ.138 కోట్లు, ట్రాఫిక్ ఫెసిలిటీ, మౌళిక వసతులు కోసం రూ. 229 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అక్కన్నపేట్ - మెదక్ లైన్ కోసం రూ.10కోట్లు,ఓబులవారిపల్లి - క్రిష్ణ పట్నం కొత్తలైనుకు రూ30కోట్ల కేటాయింపులు జరిగాయి. ముద్ ఖేడ్ - పర్బాని ప్రాజెక్టుకు రూ.34.5కోట్లు, గుంటూరు -తెనాలి మధ్య ఎలక్ట్రిఫికేషన్ కోసం రూ.5కోట్లు కేటాయించారు. మునీరాబాద్ - మహబూబ్ నగర్ ల మధ్య 246కిలోమీటర్ల రైల్వే లైను కోసం రూ. 275కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి మధ్య 56కిమీ కొత్తలైన్ కోసం రూ.405కోట్లు,కాజీపేట - బల్లార్ష మధ్య 202కిమీ థర్డ్ లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.265 కోట్లు కేటాయించారు. సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య 85కిమీ మేర చేపడుతున్న డబ్లింగ్ కోసం రూ.200, బైపాస్ లైన్ల కోసం రూ.143కోట్లు, చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి కోసం రూ.5కోట్లు కేటాయించారు.

నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 309కిమీ కొత్త లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.700కోట్లు, కడప - బెంగుళూరు మధ్య 225కిమీ కొత్త లైన్ నిర్మాణానికి రూ.210 కోట్లు, గుంతకల్ - కల్లూరు మధ్య 40.60కిమీ మేర నిర్మిస్తున్న డబుల్ లైన్ కోసం రూ.15కోట్లు, గుంటూరు - గుంతకల్ మధ్య 443కిమీ మేర నిర్మిస్తున్న డబ్లింగ్ లైన్ కోసం రూ. 280కోట్లు, విజయవాడ - భీమవరం - నిడదవోలు మధ్య 221కిమీ మేర నిర్మిస్తున్న డబ్లింగ్ కోసం రూ. 175 కోట్లు,కొత్తపల్లి - నర్సాపూర్ మధ్య 57కిమీ మేర నిర్మిస్తున్న కొత్తలైన్ కోసం రూ. 200కోట్లు, గుత్తి - ధర్మవరం మధ్య 90కిమీ మేర నిర్మిస్తున్న డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ.126కోట్లు, కాజీపేట - విజయవాడ మధ్య 219కిమీ డబ్లింగ్ పనుల కోసం రూ.110కోట్లు, విజయవాడ - గుంటూరు మధ్య 287 కిమీ మూడో లైన్ నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయించారు. ఇక హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం కేవలం 10లక్షలు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే తెల్లాపూర్ - రామచంద్రాపురం మధ్య 5కిలోమీటర్లు, మౌళాలి - ఘట్ కేసర్ మధ్య 12.2కిలోమీటర్ల లైన్లు పూర్తయ్యాయి. మిగతా పనుల కోసం అధికంగా నిధులు అవసరం వుండగా కేంద్రం మాత్రం కనీస నిధులను కూడా కేటాయించలేదు. అయితే ఘట్ కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ కోసం మాత్రం రూ.20కోట్లు కేటాయించారు. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య 150కిమీ కొత్త లైన్ కోసం రూ.200కోట్లు కేటాయించారు.