చిత్ర పరిశ్రమపై బడ్జెట్ కీలక నిర్ణయాలు

SMTV Desk 2019-02-01 18:10:05  2019 Budget, Piyush goyel, Film Industry, Piracy, Movie ticket price, Cinematography act, Single window clearance

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల్లో సినీ రంగానికి మేలు చేసే పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ వినోదాత్మక రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. పైరసీని అంతమొందించేందుకు సినిమాటోగ్రఫీ యాక్ట్‌ కింద సింగిల్‌ విండో క్లియరెన్స్, యాంటీ క్యామ్‌కార్డింగ్‌ ప్రొవిజన్‌ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ సింగిల్‌ విండో క్లియరెన్స్‌ ప్రక్రియ విదేశీ చిత్రాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు భారతీయ చిత్రాలకు కూడా దీన్ని వర్తింపజేయడంతో చిత్ర పరిశ్రమకు ఊరట లభించింది.

ఇటీవల విడుదలైన ఉరి: ది సర్జికల్‌ స్ట్రయిక్స్‌ సినిమాను తాను చూశానని, సినిమాలో ఫన్‌ మాత్రమే కాకుండా జోష్‌ కూడా ఉందని పీయూష్‌ పేర్కొన్నారు. సింగిల్‌ విండో క్లియరెన్స్‌ ద్వారా ఇతర ప్రదేశాల్లో చిత్రీకరణ జరపడానికి త్వరగా అనుమతి లభించే వెసులుబాటు ఉంది. అలాగే 100 రూపాయల ధర కలిగిన టికెట్ పై వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ తన ప్రసంగంలో తెలిపారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో ప్రధాన నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వినోదాత్మక రంగానికి బడ్జెట్‌లో పైవాటిని కేటాయించారు.