పన్ను చెల్లింపు దారులకు శుభవార్త

SMTV Desk 2019-02-01 15:59:48  Piyush Goyal, Tax Payment, Union Budget Meeting

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయపు పన్ను కడుతున్నవారికి ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ ఆదాయపు పన్ను పరిమితిని 2.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేడు పార్లమెంట్ లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2019-20 ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ.2,50,001 నుంచి రూ.5,00,000 మధ్య ఆదాయం ఉన్నవాళ్లు పన్ను మినహాయింపులు అన్నీ పక్కాగా చూపిస్తే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.

సంవత్సరానికి 6.5 లక్షల ఆదాయం ఉన్నవాళ్లు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)లో ఏవైనా పెట్టుబడులు, ఈక్విటీల్లో పెట్టుబడులు లాంటివి చేస్తే, వాళ్లు కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదన్నారు. అంతకు మించి ఆదాయం ఉన్నవాళ్లు కూడా హోమ్ లోన్స్, ఇతర లోన్స్, నేషనల్ ఇన్సురెన్స్ స్కీమ్స్, హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్ స్కీమ్స్ ల్లో డబ్బులు కట్టేవారికి కూడా పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు గోయల్ తెలిపారు. ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచడం వల్ల ప్రస్తుతం ట్యాక్స్ పే చేస్తున్న 3 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.