మిషన్ భగీరథపై హైదరాబాద్ లో వర్క్ షాప్

SMTV Desk 2019-02-01 11:43:00  Mission Bhageeratha, Hyderabad, Engineering staff college of India, Work shop on MIssion Bhageeratha, Krupakar Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణలో ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలనే ఉద్దేశ్యంతో కేసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ఆపరేషన్ ను చేపట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రభుత్వం అత్యుత్తమ పద్ధతులను అన్వేషిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులపై ఇతర రాష్ట్రాలు, విదేశాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు అధికారులు నిర్ణయించారు. మిషన్‌ భగీరథ అపరేషన్‌ నిర్వహణ విధానం, మార్గదర్శకాలు తదితర అంశాలపై హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఇస్కీ) లో మూడు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించనుంది. ఈ వర్క్‌షాప్‌ను కృపాకర్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్‌ భగీరథతో తమ తాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలంతా నమ్మకంతో ఉన్నారని, వారి ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గకుండా తరతరాలు గుర్తుంచుకునేలా భగీరథతో శుద్దిచేసిన తాగునీటిని సరాఫరా చేయాలన్నారు. మిషన్‌ భగీరథ అపరేషన్‌ నిర్వహణ విధానం దేశం మొత్తానికే రోల్‌మోడల్‌గా ఉంటుందని మిషన్‌ భగీరథ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.కృపాకర్‌రెడ్డి అన్నారు. మూడున్నరేండ్లల్లోనే భగీరథ పనులు పూర్తిచేశామని చెప్పారు. అలాగే ఎలాంటి లోపాలు, సమస్యలు ఉత్పన్నం కాకుండా తాగునీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఇంటెక్‌ వెల్స్‌, పంపింగ్‌ స్టేషన్లలో ఉపయోగించే మోనోరైల్‌ క్రేన్లను ప్రమాదరహితంగా వాడే విధానం గురించి స్మాకో సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. గ్రేటర్‌లో అమలవుతున్న స్కాడా సాంకేతిక పరిజ్ఞానంపై చీఫ్‌ ఇంజినీర్‌ చక్రవర్తి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మొదటి రోజు వర్క్‌షాప్‌లో ప్రభుత్వ సలహా దారులు జ్ఞానేశ్వర్‌, చీఫ్ ఇంజినీర్లు జగన్మోహన్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, విజయ ప్రకాష్, వినోభాదేవి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్, కన్సల్టెంట్లు నర్సింగరావు, జగన్‌, మనోహర్‌బాబుతో పాటు ఎస్‌.ఈ,ఈఈ, డీ.ఈ.ఈలు పాల్గొన్నారు.