అన్నాడీఎంకే ఒంటరి పోరాటమా...

SMTV Desk 2019-01-31 17:33:20  Anna DMK, DMK, Congress, BJP

చెన్నై, జనవరి 31: తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎవరు ఏ పార్టీతో పొత్తుకి సిద్దమవుతున్నారో ఊహించలేక పోతున్నారు. అయితే గతకొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. జాతీయ పార్టీలు ఈమధ్య కాలంలో వొక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. దీంతో నేరుగా కాకుండా స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకొని వెళ్ళడం జాతీయ పార్టీలకు ఆనవాయితీగా వస్తోంది. ఇలా డీఎంకే పార్టీతో కాంగ్రెస్, అన్నా డీఎంకేతో బీజేపీ ప్రస్తుతానికి పొత్తులో ఉన్నాయి. జయలలిత అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండగానే మృతి చెందగా ఆ పార్టీ రెండు ముక్కలుగా మారింది. దీంతో పళనిస్వామి వర్గానికి బీజేపీ సహకరించడంతో ప్రస్తుతం అధికారంలో కొనసాగుతోంది. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తీరు మారనుంది. అన్నాడీఎంకే ఇప్పుడు అన్ని నియోజకవర్గా లోని తమ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు సిద్దపడుతుంది. దీంతో స్థానిక బీజేపీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు.

ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే-బీజేపీ పొత్తుగా ఉంటారా లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. రాష్ట్రంలో బీజేపీతో కలిసి వెళితే కొన్ని సీట్లు కూడా రావని అన్నాడీఎంకే భావిస్తోంది. అందువలన వొంటరిగానే బరిలో దిగనుంది అని సమాచారం. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించడం లేదు. ఎన్నికలు దగ్గర పడితే అప్పుడు ఆలోచిస్తారట. మరోవైపు డీఎంకే కాంగ్రెస్ తో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇతర మిత్ర పక్షాలతో కూడా పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరువాత ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న పార్టీ డీఎంకే కావాలని స్టాలిన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అన్నాడీఎంకే మాత్రం బీజేపీ దోస్తీపై అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి అన్నాడీఎంకే వ్యూహంపై బీజేపీ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.