పోలీసుల వల్లే అలా చేశా...!

SMTV Desk 2019-01-31 10:27:35  Sreshanth, Police case, India, Supreme court, Spot fixing, Bench Investigation

న్యూ ఢిల్లీ, జనవరి 31: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ బుధవారం తన కేసు విచారణలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఢిల్లీ పోలీసులు చిత్రహింసలు పెట్టేవారని, వారి నుండి తప్పించుకోవడానికే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించానని అన్నారు. అంతేకాక తానూ ఏ తప్పు చేయలేదని సుప్రీం కోర్టులో ఆరోపించాడు. 2013 ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా దానిపై శ్రీశాంత్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్‌ ఈ కేసును విచారించింది. పోలీస్‌ చిత్రహింసల నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్‌ నిందను మోశాడని అతని లాయర్‌ కోర్టుకు వివరించారు.

శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని, అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్‌ కోర్టుకు అందించాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదించారు. దానిపై న్యాయమూర్తులు స్పందిస్తూ - బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్‌ ఆ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్‌ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దాన్ని బట్టి శ్రీశాంత్‌ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తెలిసిపోతోందని బెంచ్‌ స్పష్టం చేసింది.