త్వరలో 'సీతారామరాజు ఏ ట్రూ వారియర్'....

SMTV Desk 2019-01-30 19:14:21  Alloori seetharamaraju, Seetharamaraju a true warrior, Resali films academy and studio banner

హైదరాబాద్, జనవరి 30: స్వాతంత్ర సమరయోధుడు, ఆంగ్లేయులతో పోరాడి గెలిచిన విప్లవకారుడు అల్లూరి సీతారామారాజు జీవితాధారంగా ‘సీతారామరాజు ఎట్రూ వారియర్‌ అనే సినిమా నిర్మించాలని రిసాలి ఫిల్మ్‌ అకాడమీ అండ్‌ స్టూడియో బ్యానర్‌పై నిర్మాత డాక్టర్‌ శ్రీనివాస్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు పి.సునీల్‌ కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. మన్యంలో జరుగుతున్న తెల్లదొరల అకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగురవేసిన పాతికేళ్ళ కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి సినీ బృందం ప్రయత్నిస్తుంది.

ఈ చిత్రానికి యెక్కలి రవీంద్రబాబు, డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రావు సహనిర్మాతలుగా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత బాపిరాజు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకు స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపేజేసే దిశగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎపిలోనే తొలిసారిగా పూర్తి పోస్ట్‌ప్రొడక్షన్‌ వసతులతో స్టూడియో ఏర్పాటచేసిన రిసాలి ఫిల్మ్‌స్టూడియో అండ్‌ అకాడమీ బ్యానర్‌పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతోందన్నారు. విశాఖ, కాకినాడ, రాజమండి, ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో సింహభాగం షూటింగ్‌ జరుపుకోనుందని, ఈ చిత్రానికి సీనియర్‌ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుందన్నారు.