ప్రకాశం జిల్లాలో బాబు మాస్టర్ ప్లాన్..

SMTV Desk 2019-01-30 19:02:58  chandrababunaidu, tdp, prakasham, candidates list

వొంగోలు, జనవరి 30: ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2019లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో బలమైన నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని బాబు మాస్టర్ ప్లాన్ వేశారు.

అయితే ప్రకాశం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు పనితీరు ఆధారంగా బాబు అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు సిట్టింగ్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. వొంగోలు సెగ్మెంట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్, చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, అద్దంకిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, దర్శిలో శిద్దా రాఘవరావు, గిద్దలూరులో ఎం. ఆశోక్‌రెడ్డి, పర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరులో పోతుల రామరావు, కొండపిలో డోలా బాల వీరాంజనేయులుకి బాబు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.