ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను అమ్మేసిన మోదీ

SMTV Desk 2019-01-30 19:02:08  Congress chief, Rahul Gandhi, Prime miister of India, Rafale deal, Indian Air force, Anil Ambani

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పై విరుచుకుపడ్డారు. రాఫెల్ డీల్ వ్యవహారంలో​​ ప్రధాని మోదీపై ​మరోసారి విమర్శలు గుప్పించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను మోదీ అమ్మేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్నేహితుడు అనిల్ అంబానీకి రూ. 30వేల కోట్ల లబ్ధిని చేకూర్చేందుకు.... యువతకు అందాల్సిన అవకాశాలను మోదీ నిర్వీర్యం చేశారని విమర్శించారు.
యూత్ కాంగ్రెస్ సమావేశాల ముగింపు సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ​రాఫెల్ కుంభకోణాన్ని ఎవరూ దాచలేరని... ఏదో వొక రోజు వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. పార్లమెంటులో గంటన్నర సేపు మోదీ ప్రసంగించారని... రాఫెల్ డీల్ గురించి అడిగితే నేరుగా కళ్లలోకి చూడలేకపోయారని, ఎటో చూస్తూ ఉండిపోయారని ఎద్దేవా చేశారు. వాస్తవాలను దాచేందుకు​ ప్రధాని ​ మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు.
రాత్రి పూట మీరు నిద్రపోలేరు. ఎందుకంటే... మీరు నిద్రపోతే అనిల్ అంబానీ, రాఫెల్ యుద్ధ విమానాలు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మీకు కనిపిస్తారు. యువత జీవితాలతో మీరు ఆడుకున్నారనే విషయం యావత్ దేశానికి తెలుసు అంటూ మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేయబోదని చెప్పారు. 2019లో ప్రజలను మీరు ఎదుర్కోబోతున్నారని వ్యాఖ్యానించారు.