​వీవీప్యాట్‌ స్లిప్పులపై​ గుర్తులు అయిదేళ్ల వరకు పోవు

SMTV Desk 2019-01-30 18:26:49  VV pats, Telangana Elections, Congress party MLA candidates, Thermal paper, Election commission, High court

హైదరాబాద్‌, జనవరి 30: ముందస్తు ఎన్నికల్లో భాగంగా జరిగిన అనంతరం కొన్ని నియోజక వర్గాలలో వీవీ ప్యాట్‌ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై స్పందించి కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోదాడ, తుంగతుర్తి, ధర్మపురి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మావతి, అద్దంకి దయాకర్‌, లక్ష్మణ్‌, ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు.. వీవీ ప్యాట్‌ స్లిప్పుల మన్నిక, నాణ్యతపై ఇవాళ ఎన్నికల కమిషన్‌ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. వీవీ ప్యాట్‌ స్లిప్పులపై నమోదైన గుర్తు ఐదేళ్లపాటు ఉంటుందని ఈసీ తెలిపింది. ఈసీ వివరణపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏటీఎం, ఫ్యాక్స్‌ యంత్రాల్లో వాడే థర్మల్‌ పేపర్‌నే వీవీ ప్యాట్‌లలో వినియోగించారని, వాటిపై ప్రింట్‌ ఎక్కువ కాలం ఉండదని.. అందుకే ఎన్నికల పిటిషన్‌కు బదులుగా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని వివరించారు. దీంతో ఫిబ్రవరి 7వ తేదీ లోగా పూర్తి వివరణతో లిఖిత పూర్వక కౌంటర్లు దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.