వరల్డ్ కప్ కి భారత జట్టు ఇదే అంటున్న గంభీర్

SMTV Desk 2019-01-30 17:35:29  Icc world cup 2019, Gautham Gambhir dream team, Indian Team, Virat kohli, MS Dhoni

జనవరి 30: ఐసీసీ వరల్డ్ కప్ ఇక ఎంతో సమయం లేదు. 2019 లో జరిగే ఈ టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యము ఇవ్వనుంది . మే 30 నుంచి ప్రారంభం కాబోతున్న క్రికెట్‌ మహా సంగ్రామం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే వరల్డ్‌ కప్‌లో పాల్గొనే జట్లు తమ బలాబలాలను పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. టైటిల్‌ వేటలో పాల్గొనే టీమిండియా ఆటగాళ్లు ఎవరనేదిఅందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొంత మేరకు అవగాహనకు వచ్చినా ఆటగాళ్ల ఫామ్‌, గాయాల కారణంగా ప్రపంచకప్‌ ఆరంభం వరకు ఎవరు జట్టులో ఉంటారనేది చెప్పడం కష్టంగా మారింది. అయితే వన్డే వరల్డ్ కప్‌ 2019లో పాల్గొనే డ్రీం టీం భారత జట్టుని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. మొత్తం 15 మందితో కూడిన తన కలల జట్టులో యువ ఆటగాడు రిషభ్‌​ పంత్‌కు గంభీర్‌ అవకాశమివ్వలేదు. అంతేకాకుండా ​వన్డే క్రికెట్‌కు పూర్తిగా దూరమైన స్పిన్నర్‌ అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న హార్థిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లకు జట్టులో అవకాశమిచ్చాడు. ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ కొనసాగాలని, మూడో స్థానంలో రాహుల్‌, నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లి వస్తే బాగుంటుందని సూచించాడు. ఇక సీనియర్‌ ఆటగాడు​, మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని తప్పకుండా ప్రపంచ కప్‌లో ఆడాలని.. అతడు టీమిండియాకు అదనపు బలమని వివరించాడు.

​గంభీర్ కలల జట్టు :
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, ఎంఎస్‌ ధోని, హార్థిక్‌ పాండ్యా, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌