తెలంగాణ ఎన్నికలపై అనుమానాలు : లగడపాటి

SMTV Desk 2019-01-30 17:04:25  Lagadapati rajagopal, Telangana election survey, Illegal elections in Telangana

న్యూ ఢిల్లీ, జనవరి 30: ఈ ​ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నపుడు పోలింగ్ శాతం ప్రకటించడానికి వొకటిన్నర రోజులు ఎందుకు పట్టిందో ఎన్నికల సంఘం చెప్పాలని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కువ పోలింగ్ నమోదయినట్లు చెబుతున్నారనీ, అలాంటప్పుడు గంటగంటకు ఎంత పోలింగ్ నమోదయిందో చెప్పాలన్నారు. వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కిస్తే ఓటర్ల అనుమానాలు నివృత్తి అవుతాయని వ్యాఖ్యానించారు. తనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే తాను వివరణ ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సర్వేలను కూడా తాను విడుదల చేస్తానని లగడపాటి ప్రకటించారు. అప్పుడు ఫలితాలను బట్టి తెలంగాణలో తన సర్వే ఎందుకు తప్పిందో వివరణ ఇస్తానన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయనీ, వాటికి తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
తాను ఎవరి ప్రోద్బలంతో సర్వేలు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే 2009లో సొంత పార్టీపై తిరగబడ్డ వ్యక్తిని తానని లగడపాటి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. తాను ఎవరి కోసమో దొంగ సర్వేలు చేయించలేదని స్పష్టం చేశారు.​