మరో సంస్థ మరణించింది ...

SMTV Desk 2019-01-30 13:53:53  National Statistical commission, Chidabaram, Congress senior leader, Bjp, Central government, Resigned members

న్యూ ఢిల్లీ, జనవరి 30: కేంద్రప్రభుత్వంతో తలెత్తిన విభేదాలతో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్‌ ( జాతీయ గణాంకాల కమిషన్) నుంచి ఇద్దరు సభ్యులు రాజీనామా చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో సంస్థ మరణించిందంటూ ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.
‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో గౌరవప్రదమైన సంస్థ మరణించింది. దీని పట్ల మేం సంతాపం ప్రకటిస్తున్నాం. జీడీపీ, ఉద్యోగుల డేటాను నిజాయతీగా విడుదల చేసేందుకు ఆ సంస్థ చేసిన పోరాటాన్ని మేం గుర్తుంచుకుంటాం అని చిదంబరం ట్వీట్‌ చేశారు.
​ఈ కమిషన్‌లో స్వతంత్ర సభ్యులుగా ఉన్న జేవీ మీనాక్షి, పీసీ మోహనన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. కమిషన్ సమర్థవంతంగా పనిచేయట్లేదని, తమను పట్టించుకోవట్లేదని పీసీ మోహనన్‌ ఈ సందర్భంగా ఆరోపించారు. కాగా.. వీరి రాజీనామాతో గణాంకాల కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఇద్దరికి తగ్గింది. ప్రస్తుతం కమిషన్‌లో ప్రధాన గణాంకాల అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ, నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సభ్యులుగా ఉన్నారు.