'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ల లిస్టులో మరో బ్యూటీ....

SMTV Desk 2019-01-30 12:24:20  RRR, Rajamouli, Ram charan, NTR, Alia bhatt

హైదరాబాద్, జనవరి 30: సంచలన దర్శకుడు రాజమౌళి తొలి సారి మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ . ఈ సినిమాలో టాలీవుడ్ బడా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజుల క్రితం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పటివరకు జక్కన్న రివీల్ చెయ్యలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్స్ కు జక్కన్న గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్స్ పరిణీతి చోప్రా, జాన్వీ కపూర్, సారా ఖాన్ పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో బ్యూటి ఆలియా భట్‌ పేరు తెరపైకి వచ్చింది. కరణ్‌ జోహార్‌ ద్వారా ఆర్‌.ఆర్‌.ఆర్‌ బృందం అలియాతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

అంతేకాక మరో హీరోయిన్ కోసం కైరా అద్వానీని అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ గా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. మరీ.. ఫైనల్ గా జక్కన్న ఎవరిని ఎంపిక చేస్తారన్నది చూడాలి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో తారక్ అడవి దొంగగా, ఆయన్ని పట్టుకొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని సమాచారం. ఇక, ఈ సినిమా కోసం రామ రావణ రాజ్యం టైటిల్ దాదాపు ఫిక్సయినట్టేనని చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.