భారత్-పాక్ నో మ్యాచ్...!

SMTV Desk 2019-01-30 11:07:53  India, Pakistan, T20 World cup schedule, India VS Pakistan No match, ICC

న్యూ ఢిల్లీ, జనవరి 30: మంగళవారం ఐసీసీ విడుదల చేసిన 2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ అందరిని ఎంతగానో ఉత్సాహపరిచినా భారత్, పాక్ క్రికెట్ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. టీ20 ప్రపంచ క్రికెట్ కప్ లీగ్ లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకపోవడం వాళ్ళ ఇరు జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ జట్ల మధ్య పోటీ ఫలితం ఎప్పుడూ భారత్ వైపే ఉండడం విశేషం. 2011 వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత 2012, 2014, 2016 టి20 ప్రపంచకప్‌లతో పాటు 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ఇరు జట్లు లీగ్‌ దశలోనే తలపడ్డాయి.

అత్యంత ఉత్కంఠ రేపిన ఆ నాలుగు మ్యాచుల్లో కూడా విజయం భారత్ నే వరించింది. ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా జూన్‌ 16న ఇరు జట్లు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దాయాదుల మధ్య లీగ్ దశలో పోటీ లేదు. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించిన షెడ్యూల్‌లో భారత్, పాకిస్తాన్‌ రెండు వేర్వేరు గ్రూప్‌లలో ఉన్నాయి. ప్రస్తుత టి20 ర్యాంకింగ్స్‌లో పాక్‌ తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉండటమే అందుకు కారణం. నాకౌట్‌ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందా, లేదా అనేది లిగ్ దశ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.