శాంతి భద్రతలపై కేరళ సీఎం సమావేశాలు

SMTV Desk 2017-08-01 11:20:11  thiruvananthapuram, kerala rss cm pinarai vijayan, bjp,State Governor P. Sadasivam, CM Vijayan State DGP

తిరువనంతపురం, ఆగస్టు 1 : ఇటీవల కేరళలో ఆరెస్సెస్‌ కార్యకర్త హత్య నేపథ్యంలో అన్నివైపులా ఒత్తిడి పెరగడం తో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా భాజపా ఆరెస్సెస్‌ నేతలతో భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయ కక్షల కారణంగా పరస్పర దాడులు పెరిగిన తరుణంలో ఈ అంశంపై ఆగస్టు 6న అఖిల పక్ష భేటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు విజయన్ వెల్లడించారు. శాంతిని నెలకొల్పేలా తిరువనంతపురంతో పాటు కొట్టాయం, కన్నూర్ లోనూ శాంతి సమావేశం నిర్వహించేదుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఆరెస్సెస్‌ కార్యకర్త హత్య అనంతరం రాష్ట్ర గవర్నర్ పి. సదాశివం, సీఎం విజయన్ రాష్ట్ర డీజీపీకి సమన్లు జారీ చేయగా, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం విజయన్ తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో భాజపా ఆరెస్సెస్‌ లతో భేటీ అవుతానని తెలిపిన విజయన్, ఈ మేరకే భాజపా, ఆరెస్సెస్‌ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖరన్, మాజీ కేంద్రమంత్రి రాజ్ గోపాల్, ఆరెస్సెస్‌ గోపాల్ కుట్టీ , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ లు పాల్గొన్నారు. శనివారం రాత్రి ఆరెస్సెస్‌ కార్యకర్త దారుణ హత్యకు గురికాగా, అంతకు ముందు భాజపా కార్యాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కుమారుడి నివాసంపైన దుండగులు రాళ్ల దాడి చేయడం వంటి ఘటన నేపథ్యంలో నేటి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.