ఒంగోలులో వజ్రాయుధాన్ని ప్రయోగిస్తున్న వైసీపీ.

SMTV Desk 2019-01-28 15:15:37  YS Jagan mohan reddy, YS Sharmila, ongole mp seat, YCP, YV Subbareddy, Balineni srinivasa reddy

వొంగోలు, జనవరి 28: రానున్న ఎన్నికల తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు వొక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోడానికి ఓ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రకాశం జిల్లాలో వైఎస్ షర్మిలను రంగంలోకి దించుతుంది. ఇటీవల జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రమంతటా పర్యటించింది. వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ నేఫథ్యంలో వొంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఈ సారి వైవీ సుబ్బారెడ్డిని కాకుండా వైఎస్ షర్మిలను పోటీకి దించాలని ప్రతిపాదించింది. వొంగోలులో ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్థసారథి గ్రూపులు ఏర్పడ్డాయని ప్రశాంత్ కిశోర్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

అయితే వైవీ సుబ్బారెడ్డి వలెనే జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ టీమ్ కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డికి బదులు షర్మిలను దించితే పార్టీకి లబ్ధి చేకూరుతుందని జగన్ కు కిశోర్ సూచించారు. దీనివల్ల బాలినేని, పార్థసారథి వర్గాలు కలిసి పనిచేస్తాయనీ, తద్వార జిల్లాలోని గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, వొంగోలుతో పాటు మెజారిటీ సీట్లను దక్కించుకోవచ్చని చెప్పారు. వొకవేళ షర్మిలను దించకుంటే అంతర్గత పోరు కారణంగా పార్టీ నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో షర్మిలను వొంగోలు నుంచి పోటీకి దించే అంశాన్ని జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్తు తెలుస్తోంది.