తెలంగాణ కాంగ్రెస్ కి సుప్రీం షాక్

SMTV Desk 2019-01-28 13:34:10  Telangana Congress, Supreme court, Marri shahsidar reddy, Mumpu mandals,Ap

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణలోని ఏడు ముంపు మండలాల ఓటర్లను ఏపీలో కలుపుతూ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కి షాక్ తగిలినట్టయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ, రాజ్యాంగ సవరణ చేయకుండా ముంపు మండలాలను ఏపీలో కలపడం కుదరదని తెలిపారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి విరుద్ధమని వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. అనంతరం ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇంతకుముందు ఈ విషయంలో మర్రిశశిధర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన సుప్రీం మెట్లు ఎక్కారు. తెలంగాణలోని బూర్గుంపాడు, వెలియరపాడు, కుక్కునూరు, భద్రాచలం చింతూరు, కూనవరం, వరరామచంద్ర మండలాలను కేంద్రం ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల 200 పైచీలుకు గ్రామాల్లో దాదాపు 1.20 లక్షల మంది ఓటర్లు ఏపీలో చేరారు.