ఇద్దరు ఇద్దరే ... ఏపీ లో రాజకీయం

SMTV Desk 2019-01-28 12:06:59  Andhra pradesh special status, Tdp, Chandra babu, Ycp, Jagan, CPI, Ramakrishna, Bjp, 10 year special status in manifesto

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా గురించి సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ 2014 బీజేపీ మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని ఉందని తెలిపారు. ఈ విషయం పై అందరికన్నా ఎక్కువగా అప్పటి బిజెపి సీనియర్ లీడర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారని అన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి అసలు బీజేపీ మేనిఫెస్టోలో హోదా విషయమే లేదనీ, మోదీ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో వివిధ మంత్రిత్వా శాఖలో అధికారం అనుభవించిన కన్నా ఇప్పుడు బీజేపీలో చేరి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీని దోచుకున్నవారికి చంద్రబాబు ఎలా మద్దతు ఇస్తున్నారో చూడండని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైద్య రంగాన్ని చంద్రబాబు కార్పొరేట్ పరం చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేనంత అవినీతి ప్రస్తుతం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ లంచగొండి ప్రభుత్వం తరిమికొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు కేటాయించిన రూ.350 కోట్ల నిధులను కేంద్రం వెనక్కు తీసుకోవడంతో పాటు గత రెండేళ్లుగా ఈ నిధులను మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి రూ.16 వేల కోట్ల సాయం చేయాల్సి ఉండగా, రూ.3 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.