వైసీపీ లో కి సీనియర్ నటి

SMTV Desk 2019-01-26 13:46:59  Jayaprada, Senior actress, Rajyasabha Mp, Sp, YSrcp, Loksabha

అమరావతి, జనవరి 26: ప్రముఖ సీనియర్ నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే ఏపీ నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నారా? అంటే సన్నిహిత వర్గాలు అవుననే చెబుతున్నాయి. జయప్రద వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనీ, ఇందుకోసం వైసీపీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ తరఫున మరోసారి రాజ్యసభ టికెట్ దక్కించుకున్నారు. సమాజ్ వాదీ పార్టీలో ఆమె అమర్ సింగ్ మనిషిగా గుర్తింపు పొందారు. అయితే పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ మధ్య విభేదాలు రావడంతో జయప్రద సమాజ్ వాదీ పార్టీని వీడాల్సి వచ్చింది. అప్పటి నుంచి జయప్రద ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా సొంత రాష్ట్రంపై దృష్టి సారించిన జయప్రద జనసేనలో చేరతారని తొలుత వార్తలు వచ్చాయి. కాగా సంస్థాగతంగా బలంగా లేని జనసేన కంటే వైసీపీలో చేరేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజమండ్రి లోక్ సభ స్థానం ఇవ్వాలనీ, లేదంటే రాజ్యసభకు నామినేట్ చేయాలని జయప్రద కోరుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ నిర్ణయం ఏంటో ఇంకా వెల్లడి కాలేదు.