ఎమ్మెల్యేని అడ్డుకున్న తెరాస కార్యకర్తలు ..

SMTV Desk 2019-01-26 13:10:09  TRS, Congress, 2019 panchayath Elections, MLA banotu haripriya

కొత్తగూడెం, జనవరి 26: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రచారాన్ని తెరాస కార్యకర్తలు అడ్డుకోవడంతో టీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని టీఆర్ఎస్ మండల కార్యాలయంపై కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడి ఫర్నిచర్‌ను, ఫ్లెక్సీలు తదితర వాటిని ధ్వంసం చేశారు. తెలంగాణాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కోయగూడెంలో ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యే ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కోపోద్రేక్తులయ్యారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మండల టీఆర్ఎస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని దాడికి పాల్పడ్డారు. అక్కడున్న కుర్చీలు, టేబుళ్లు,ఫ్లెక్సీలు, బెంచీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. తెరాస కార్యాలయంపై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.