విజ్డమ్ జాబ్స్ పోర్టల్ కుంభకోణం

SMTV Desk 2019-01-25 17:48:15  Wisdom it services cheating, ajay kolla, cyberabad police, cheating case,software jobs, unemployement

హైదరాబాద్‌, జనవారి 25: మనతో పాటు వివిధ దేశాలలోని కార్పొరేట్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాల కల్పిస్తామని మోసాలకు పాల్పడిన సంస్థ ప్రతినిధులను ఈరోజు సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. విజ్డమ్‌‌‌ జాబ్స్‌ పేరుతో కోట్ల రూపాయలు టోకరా వేసిన సంస్థ డైరెక్టర్‌ అజయ్‌ కొల్లా సహా 14 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఈ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 3కోట్ల మంది విజ్డమ్‌‌ జాబ్స్‌ వెబ్‌సైట్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో సుమారు లక్ష మంది వరకూ మోస పోయినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని సైబర్‌ టవర్స్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని వీరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తుంది . భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సంస్థ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఉద్యోగాలు కావాలనుకునే వారు తమ బయోడేటాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఈ‌ సంస్థ సంబంధించిన ఉద్యోగులు , నిరుద్యోగులకు ఫోన్‌ చేస్తారు. ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి ఎంపిక చేస్తామని నమ్మించి.. దానికి కావాల్సిన అమౌంట్ రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత పేస్ టూ పేస్ ఇంటర్వ్యూ లో ఎంపికయ్యారని మరికొంత డబ్బు వసూలు చేసి... తర్వాత వారికి సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నట్టు పోలిసుల దర్యాప్తులో తేలింది. పూర్తి వివరాల కోసం మరింత లోతుగా దర్యాప్తుచేస్తున్నట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ మీడియా కి తెలిపారు.