వైసీపీ తీర్థం పుచ్చుకున్న మరో ఇద్దరు కీలక నేతలు

SMTV Desk 2019-01-25 17:45:31  ys jagan, ysrcp, harischandrareddy, ravichandrareddy, bjp, congress, ap assembly elections 2019, hyderabad

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం పక్కచూపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజగా హైదరాబాద్ లో వైఎస్ జగన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన ప్రతినిధి రవిచంద్రారెడ్డి, బీజేపీ నేత హరిశ్చంద్రారెడ్డిలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డికి రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టుంది. ప్రత్యర్థి పార్టీలను తన మాటల తూటాలతో ఇరుకున పెట్టగల సమర్థుడుగా మంచి పేరుంది. కాగా ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

రవిచంద్రారెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసిన తరువాత వైసీపీలో చేరాలనుకున్నారు. కానీ పార్టీలో చేరకుండానే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ఢిల్లీలో నిర్వహించిన 'వంచనపై గర్జన' కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ముహూర్తం కుదరడంతో బీజేపీ నేత హరిశ్చంద్రారెడ్డితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిమయమైందని దాన్ని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు బాగోతం బయటపెడతానని జగన్ ను సీఎం చేసేందుకు కృషి చేస్తానన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని రవిచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.