'మిస్టర్ మజ్ను' రివ్యూ..

SMTV Desk 2019-01-25 16:37:16  Akhil, Mr.Majnu, nidi agarwal, venky atluri, BVSN Prasad, review

హైదరాబాద్, జనవరి 25: అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా ఈరోజు థియేటర్స్ కి వచ్చింది. నిది అగర్వాల్ కధానాయికగా నటించిన ఈ సినిమాని బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. మొదటి రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోడంతో అఖిల్ ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దాంతో అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన ప్రేమకథ చిత్రంతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందికి వచ్చాడు. ఇక తొలిప్రేమ చిత్రంతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాలో అఖిల్‌ను ప్లేబాయ్‌గా చూపించాడు. మరి మిస్టర్ మజ్ను అఖిల్ కి ఆశించిన హిట్ ఇచ్చిందా? ప్రేక్షకుల అంచనాలు అందుకుందా?

చిత్రం : Mr మజ్ను
నటీనటులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి
సంగీతం : ఎస్‌.ఎస్ తమన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌

కథ‌ :
విక్రమ్‌ కృష్ణ అలియాస్‌ విక్కీ (అఖిల్) లండన్‌లో ఎంఎస్‌ చేస్తుంటాడు. అక్కడ ప్లేబాయ్‌లా అమ్మాయిలను ఆకర్షిస్తూ సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలా త‌న‌కి చాలామంది గర్ల్‌‌ఫ్రెండ్స్ ఉంటారు. నిక్కీ (నిధి అగ‌ర్వాల్) త‌న‌కి శ్రీరాముడిలాంటి భర్త కావాలని క‌ల‌లు కంటుంది. ఈ నేపథ్యంలో విక్కీని, అత‌ని మ‌న‌స్త‌త్వాన్ని చూసి అస‌హ్యించుకుంటుంది. ఇండియాకి వచ్చాక విక్కీ తన బంధువే అన్న విషయం తెలుస్తుంది. వొక‌రి ఇంటికి మ‌రొక‌రు వ‌చ్చిపోయే క్ర‌మంలో విక్కీ అస‌లు మ‌న‌సేంటో తెలుసుకుని అత‌ని ప్రేమ‌లో ప‌డుతుంది నిక్కీ. కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని విక్కీ ఆమెను దూరం చేసుకుంటాడు. కానీ తరువాత తాను కూడా నిక్కీని ప్రేమిస్తున్న విషయం విక్కీకి అర్థమవుతుంది. దూరమైన ప్రేమ కోసం విక్కీ ఏంచేశాడు..? తిరిగి ఇద్దరు ఎలా కలుసుకున్నారు..? అన్నదే మిగతా కథ.





న‌టీన‌టులు :

అఖిల్ తన నటనలో కొత్తదనం కనబరిచాడు. వయసుకు తగ్గ పాత్రలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ప్లేబాయ్‌ తరహా పాత్రలో పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. లుక్స్‌ పరంగా మన్మథుడిని గుర్తు చేశాడు. యాక్షన్‌ సీన్స్‌, డాన్స్‌లతోనూ ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఎమోషనల్‌ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ వొదిగిపోయింది. అందచందాలతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికి పెద్దగా స్కోప్‌ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్‌ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు.




విశ్లేష‌ణ‌ :
తొలి సినిమాతోనే అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్‌, రెండో సినిమా హలోతో కాస్త పరవాలేదనిపించుకున్నాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక మూడో సినిమాగా తన వయస్సుకి తగ్గట్టు రొమాంటిక్ లవ్‌ స్టోరి ఎంచుకున్నాడు. లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్మెంట్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో బాగానే నడిచినా.. సెకండ్‌ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. జార్జ్‌ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్‌ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్‌ పాయింట్స్‌ :
అఖిల్‌
ఫస్ట్ హాఫ్
కామెడీ
సినిమాటోగ్రఫి

మైనస్‌ పాయింట్స్‌ :
రొటీన్‌ స్టోరి
సెకండ్‌ హాఫ్