పరువు పోయిందని రైతు ఆత్మహత్యాయత్నం

SMTV Desk 2017-07-31 14:03:02  farmer, soul, commit, suicide

కరీంనగర్, జూలై 31 : ఇటీవల కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పొలం పనులు చేస్తుండగా బావ(భూంరెడ్డి) తనను వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ(సునీత) మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై తమ్ముడి భార్య ఫిర్యాదు చేయడంతో పరువు పోయిందని పురుగుల మందు తాగి భూంరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... బ్రాహ్మణపల్లి గ్రామంలోని భూమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే అన్నదమ్ములకు తరచూ భూ వివాదాలు తలెత్తుతుండేవి. ఈ క్రమంలో భూంరెడ్డి తన భూమిని సాగు చేసుకోవడానికి వెళ్తుండగా శ్రీనివాస్ రెడ్డి, అతని భార్య సునీత లు అడ్డురావడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై తన బావ బట్టలూడదీశాడని ఫిర్యాదు చేసినా పోలీసులు తీసుకోలేదు. దీంతో ఆమె మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఆ సంఘటనపై మానవ హక్కుల కమిషన్ సెప్టెంబర్ 25 లోగా నివేదిక ఇవ్వవలసిందిగా కరీంనగర్ సిపీ ని ఆదేశించడం గమనార్హం. ఈ ఘటన ఊళ్లో వారందరికీ తెలియడంతో తన పరువు పోయిందని మనస్తాపం చెందిన భూంరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం భూంరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. అయితే సునీతను వివస్త్రను చేస్తుండగా చరవాణిలో చిత్రీకరించినట్లు సమాచారం.