ఏపీలో భారీ ప్రాజెక్టుల ఒప్పందం

SMTV Desk 2019-01-23 19:50:05  Nara lokesh, AP Minister, Dawes, Sajjanjindal

దావోస్, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు వెయ్యడానికి కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి మరో పారిశ్రామిక దిగ్గజం ముందుకొచ్చింది. ఉక్కు, ఇంధన, సిమెంట్, మౌలిక సదుపాయాలు, క్రీడా రంగాలలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జిందాల్ గ్రూప్ రూ.3500 కోట్లతో ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టులో రెండు జెట్టీల అభివృద్ధి, పైప్‌లైన్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవగాహన వొప్పందం చేసుకుంది. దావోస్ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ వొప్పందాలపై నాలుగు పక్షాలకు చెందిన అధికారులు సంతకాలు చేసుకున్నారు.





రాష్ట్ర మౌలిక సదుపాయాల (పోర్టులు) శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, ఏపీ మ్యారిటైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లతో జెఎస్‌డబ్ల్యూ ఈ అవగాహన వొప్పందం చేసుకుంది. వొప్పందం మేరకు ఏపీలోని రామాయపట్నం పోర్టులో స్టాక్‌యార్డు, పోర్టు కార్యకలాపాలకు వీలయ్యే సుమారు 200 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో రెండు జెట్టీలను నిర్మిస్తారు. అలాగే, రూ.2500 కోట్లతో పైప్‌లైన్ ఏర్పాటుచేస్తారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం 40 మందికి ప్రత్యక్షంగా, 175 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.