కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి ఫిర్యాదు

SMTV Desk 2019-01-23 18:40:02  Kishan reddy, BJP MLA, Congress party, Congress party leaders, Police case, Telangana DGP, Kapil sibal, Shujoo

హైదరాబాద్, జనవరి 23: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి‌కి ఫిర్యాదు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డిపై హత్యాయత్నం చేసినట్లు ఎన్నారై హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అతడు కావాలనే తనపై షుజా అసత్య ఆరోపణలు చేశాడని...అతడు అలా మాట్లాడేలా కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబల్ ప్రోత్సహించి వుంటాడని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కపిల్ సిబల్, షుజాలపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి‌కి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ది కోసమే ఈ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సిబల్‌ ప్రోద్బలంతోనే షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. షుజా పేర్కొన్న వ్యక్తులు గాని, గెస్ట్ హౌస్ గానీ తనకసలు తెలియదని అన్నారు.

ఈ గెస్ట్‌ హౌజ్‌ ఎక్కడుందో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.తాను నిజంగానే 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకుని వుండేది కదా అని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో 2013 మే13 న ఓ గెస్ట్ హౌస్ లో కిషన్ రెడ్డి 11 మందిని అతి కిరాతకంగా మర్డర్ చేయించాడని సయ్యద్ షుజా అనే హ్యాకర్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో పాటు మరో 12 మంది గెస్ట్ హౌస్ లోకి వెళ్లగా కిషన్ రెడ్డి మనుషులు 11 మందిని చంపారని...తాను మరో వ్యక్తి వారి నుండి తప్పించుకున్నామని తెలిపాడు. ఈ హత్యలు మతకలహల కారణంగా జరిగినట్లు పేర్కొంటూ కిషన్ రెడ్డి తప్పించుకున్నారని షుజా వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారం తర్వాత కిషన్ రెడ్డి మనుషుల నుండి తప్పించుకోడానికి తాను అమెరికా వచ్చానని షుజా వెల్లడించాడు.