టీడీపీతో పొత్తే వద్దు : కోమటిరెడ్డి

SMTV Desk 2019-01-23 18:17:23  TDP, Congress party,Komati reddy venkatareddy, Telanagana assembly elections, Telangana parliament elections

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుపై హైదరాబాద్ లో మీడియాతో సమావేశమైన పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని తెగేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమిపాలయ్యామని ఆరోపించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అదే తప్పుచేయోద్దని హితవు పలికారు. అలాగే ప్రస్తుతం ఉన్న పీసీసీ టీమ్ తో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.

పీసీసీని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 8 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదన్నారు. రాజకీయాల పరంగా విబేధాలు ఉండటం సహజమేనని అయితే వ్యక్తిగత వైరం లేదని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.