అందుకే టీడీపీకి మద్దతు ఇచ్ఛా....

SMTV Desk 2019-01-23 16:29:07  Pawan kalyan, tdp, janasena, Chandrababu, Vishakhapatnam, Paderu village

విశాఖపట్నం, జనవరి 23: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలోని పాడేరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ టీడీపీ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా నాకు ఇచ్చిన మాట తప్పింది, ఇచ్చిన మాట తప్పితే నేను ఆ పార్టీని వదులుతాను అని ముందే చెప్పాను అని అందుకే నేను అందులోంచి బయటకు వచ్చాను అని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే తాట తీస్తానని వారికి ముందే చెప్పానని ఇకపై అదే చేస్తానని స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లా తాను రాజకీయాల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు రాలేదని పవన్ స్పష్టం చేశారు. తన దగ్గర వేల కోట్లు లేవు కానీ ప్రజలకు సేవ చెయ్యాలన్న సంకల్ప మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. నాలుగు గోడల మధ్య కూర్చునో లేక పెద్దోళ్లతో కూర్చుని రాజకీయాలు చెయ్యడమో తన ఉద్దేశం కాదని ప్రజలకు మంచి చెయ్యడమే తన లక్ష్యమన్నారు. తాను ఉత్తరాంధ్ర ప్రజాపోరాటయాత్రలో తాను ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకుని చలించిపోయానన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అయినా ప్రజలకు ఏదో మంచి చేస్తుందని తాను మద్దతు ఇచ్చానని అయితే ఆ పార్టీ దోచుకోవడ పరమావధిగా మారిందని మండిపడ్డారు.

గిరిజనులకు భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని చెప్పారు. తాము దోపిడీ చేసే వాళ్లం కాదని దోపిడీ చేసేవాళ్ల తాట తీసేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఏజెన్సీలో మైనింగ్ ను అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదన్నారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ చట్టసభలకు వెళ్లదని మండిపడ్డారు. తాను మాత్రం రోడ్లపైకి వచ్చి ప్రజలకోసం పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. బాక్సైట్ వెనుక ఉండేది వైసీపీ నాయకులేనని పవన్ ఆరోపించారు. గిరిజన యువతకు ఉద్యోగాలు లేక గంజాయి సాగుకు వెళ్లి తెలియకుండానే కేసుల్లో ఇరుక్కుంటున్నారని పవన్ తెలిపారు. గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని పవన్ భరోసా ఇచ్చారు. ఏజెన్సీలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే టూరిజాన్ని అభివృద్ధి చేసి లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని పవన్ హామీ ఇచ్చారు. అలాగే పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు అండగా ఉంటామని తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ప్రజలకు అండగా ఉంటానని మైనింగ్ కు ఎవరు పాల్పడినా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ఈ విషయంలో జనసేన నాయకులు కూడా తప్పటడుగులు వేస్తే చొక్కా పట్టుకుని నిలదియ్యాలని ఉపేక్షించొద్దని జనసేనాని చెప్పుకొచ్చారు.