ఫాన్స్ కోసం స్పీడ్ పెంచిన ప్రభాస్..

SMTV Desk 2019-01-23 13:01:30  Prabas, Saho, sradda kapoor, bahubali, jill, prabas next movie

హైదరాబాద్, జనవరి 23: గత ఐదు సంవత్సరాలలో ప్రభాస్ సినిమాలు కేవలం బాహుబలి రెండు భాగాలు మాత్రమే విడుదల అయ్యాయి. బాహుబలి తరువాత ప్రభాస్ ప్రస్తుతం ' సాహో' లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలకానుంది. అయితే ఇదే సంవత్సరం చివరిలో ప్రభాస్ హీరోగా, జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ తెరకెెక్కిస్తున్న సినిమా కూడా విడుదలకానుంది. ఈ వార్త బయటకి రాగానే ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

కాగా, తొలుత రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే, సాహో షూటింగ్ పూర్తి కాగానే, ఈ సినిమాకూ ప్రభాస్ డేట్లను కేటాయించడంతో, అనుకున్న సమయంకన్నా ముందుగానే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. దీంతో సాహో విడుదలైన నాలుగు నెలల్లోపే ఈ సినిమా సీడుదల కానుందట.