గణేషుని చందాలు వసూలు చేస్తే చర్యలు తప్పవు : సిపీ

SMTV Desk 2017-07-31 11:17:42  ganesh navaratrulu, Police with an incredible security,August 25th September 5, Navarathri Festivals,Police Commissioner Emmahendarreddi

హైదరాబాద్, జూలై 31 : ప్రతి ఏటా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రోత్సవాలకు ఈ సంవత్సరం కూడా కట్టుదిట్టమైన భద్రతకు పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 25నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్న సందర్భంగా వినాయక చవితి మండపాల ఏర్పాటు, నిర్వహణకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నగర పోలీసు శాఖ పేర్కొన్నారు. చందాలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పండుగలు, ఉత్సవాల పేరిట డబ్బులు వసూలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా చందాల వసూలును నిషేధించామన్నారు. ఈ విషయంపై గణేష్ మండప నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా చందాలు అంటూ డబ్బులు వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉత్సవాలు, ఊరేగింపు సమయాల్లో బాణసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. కాగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలన్నారు. ఆగస్టు నుంచి దరఖాస్తులు ఆయా ఠాణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. విగ్రహాన్ని ఏ ప్రాతంలో అయితే ఏర్పాటు చేస్తారో అక్కడి స్థానికులతో నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా దరఖాస్తుకు జతచేయాలన్నారు. దరఖాస్తులను ఆగస్టు 10-16వ తేదీ వరకూ అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. గణేషుడి నవరాత్రులు పూర్తైన తరువాత మహా నిమజ్జనం సెప్టెంబర్‌ 5న జరగనున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ ఎం. మహేందర్‌రెడ్డి వెల్లడించారు.