పదవి విరమణ చేసిన అర్చకులకు పెన్షన్లు...?

SMTV Desk 2019-01-21 18:12:29  A Hindu priest Pensions, Telangana state government, Archaka samakhya rastra karyavargha meeting

హైదరాబాద్, జనవరి 21: నిన్న బర్కత్‌పురలోని అర్చకభవన్‌లో జరిగిన అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అర్చకులు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో అర్చకులుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యూటీ ఇవ్వాలని రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సమాఖ్య డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. పదవీ విరమణ చేసిన అర్చక ఉద్యోగులకు ప్రతి నెల రూ.20వేల చొప్ఫున పెన్షన్‌, 10లక్షల గ్రాట్యూటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అర్చకుల పదవి విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 65ఏళ్లకు పెంచినప్పటికీ పదవి విరమణ పొందిన తర్వాత ఎలాంటి సౌకర్యాలు అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జివో 577 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చక ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని చెప్పారు. దీప ధూ నైవేద్యం కింద పనిచేస్తున్న అర్చకులకు ప్రస్తుతం రూ.6వేలు అందిస్తున్నారని,దానిని రూ.10వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో దేవాలయ భూములను అన్యాక్రాంతం నుండి కాపాడాలని, అర్చకుల ఆధీనంలో ఉన్న దేవాలయాల భూములను అర్చకుల పేరుతో పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 35వేల ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అర్చకుల అధీనంలో ఉన్న భూములు మాత్రం భద్రంగా ఉన్నాయని వివరించారు. అర్చకులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, అర్చకులు, బ్రాహ్మణుల సంక్షేమానికి కెసిఆర్‌ ప్రభుత్వం పాటుపడడం వల్లనే ఈ ప్రభుత్వం మళ్లీ మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తే 16లక్షల మంది బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో అర్చకులు, బ్రాహ్మణులతో భారీ సమావేశం ఏర్పాటు చేసి, దానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దేవాలయ భూములను సాగుచేస్తున్న అర్చకులకు రైతు బంధు, రైతు భీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, ప్రధాన కార్యదర్శి ఎన్‌.చక్రవర్తుల వేణుగోపాలచార్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చిన్న మోహన్‌, నాయకులు నవీన్‌, ఎ.ఆంజనేయచారి, వేణుగోపాల్‌శర్మ, వీరభద్రశర్మ, రాజేశ్వర్‌శర్మ, శ్రీధరాచార్యులు, నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.