అగ్రవర్ణాల రిజర్వేషన్‌పై కేంద్రానికి హైకోర్టు నోటీసులు..

SMTV Desk 2019-01-21 17:36:31  ebc 10 percent reservations, reservations, upper caste poor, Tamilanadu high court, BJP, BJP government

చెన్నై, జనవరి 21: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ మద్రాస్‌ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ పై మద్రాస్‌ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఫిబ్రవరి 18లోగా అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లపై వివరణ ఇవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రిజర్వేషన్‌ అనేది పేదరిక నిర్మూనలకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని డీఎంకే పిటిషన్‌లో పేర్కొంది. సామాజికంగా వెనుబడి, ఎన్నో శతాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం రిజర్వేషన్లు పెట్టారని వివరించారు.

ఇదే నేపథ్యంలో అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ బీసీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ పిటిషన్‌ వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల బిల్లు.. రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్‌ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. కాగా ఈ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.