దీక్షకు దిగిన మాజీ మంత్రి

SMTV Desk 2019-01-21 13:51:12  Thadepally constituency MLA Manikyalarao, TDP

తాడేపల్లిగూడెం, జనవరి 21: నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు సోమవారం నాడు నిరవదిక నిరాహార దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ దీక్షకు పూనుకున్నారు మాణిక్యాలరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 56 హామీలను అమలు చెయ్యాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. అంతకుముందు తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.





నిరవధిక నిరాహార దీక్షను తొలుత తహాశీల్దార్ కార్యాయలం దగ్గర చేపట్టాలని మాజీమంత్రి భావించారు. అయితే అందుకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన క్యాంప్ కార్యాలయంలోనే దీక్షకు దిగారు. ఇకపోతే గత నెల 25న చంద్రబాబు నాయుడుకి రాజీనామా అల్టిమేటం పంపించారు పైడికొండల మాణిక్యాలరావు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి నుంచి స్పందనరాకపోవడంతో సోమవారం నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాణిక్యాలరావుతో పాటు పలువురు బీజేపీ నేతలు సైతం దీక్షలో పాల్గొన్నారు.