ట్రిక్స్ ప్లే చేస్తున్న వైట్ కాలర్ నేరగాళ్లు..

SMTV Desk 2019-01-21 13:43:24  Mehul Choksi, Nirav modi, PNB Scam, Indian passport, Antigua, cbi

న్యూఢిల్లీ, జనవరి 21: బ్యాంకులకు ఋణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న వైట్ కాలర్ నేరగాళ్లను భారత్‌కు రప్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నాలకు గండిపడింది. పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్‌లో నిందితుడు మెహుల్‌ చోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకుని అంటిగ్వా ప్రభుత్వానికి తన పాస్‌పోర్ట్‌ను అప్పగించారు. చోక్సీ ఏడాదికి పైగా అంటిగ్వాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఋణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ దేశం వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని గత ఏడాది డిసెంబర్‌ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు.

కాగా, అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్‌ మోదీతో కలిసి చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ 13,000 కోట్ల మేర మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. అయితే భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత దేశ చట్టం ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని తెలుస్తుంది.