కృష్ణాలో కులం చిచ్చు...

SMTV Desk 2019-01-21 13:11:44  Krishna district, Gannavaram mandal, Kesaripally Village Caste fighting

కృష్ణా, జనవరి 21: జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో కులం చిచ్చు రాజుకుంది. రెండు సామజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ దారి తీసింది. పూర్తి వివరాల ప్రకారం కేసరపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఇద్దరు యువకుల మధ్య చిన్న గొడవ జరిగి, అది ఘర్షణకు దారి తీయడంతో వొకరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతల దృష్ట్యా రెండు వర్గాల కాలనీల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం వొక సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు తమ సామాజికవర్గమే గొప్పదంటూ.. యువకుడిపై దాడి చేసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై ఆగ్రహంచిన మరో సామాజిక వర్గం యువకులు ఆ వీడియోపై నిరసన తెలుపుతూ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి గ్రామంలోకి పంపారు. అంతకు ముందు రాస్తారోకోకు వెళ్లడానికి ముందు వారిలో కొందరు మరో వర్గానికి చెందిన యువకుడిపై దాడి చేయడంతో తిరిగి అదే మార్గంలో వస్తున్న ఆందోళనకారులను తమ కాలనీ దాటి వెళ్లకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉన్నతాధికారులు భారీగా బలగాలతో గుంపును చెదరగొట్టారు. గ్రామంలో మరోసారి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.