పాండ్యా, రాహుల్ పై సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి...

SMTV Desk 2019-01-20 18:30:27  Hardik pandya, KL Rahul, BCCI, CK Khanna, Supreme court

న్యూ ఢిల్లీ, జనవరి 20: భారత యువ క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పై సస్పెన్షన్ ను ఎత్తి వేయాలంటూ పాలకుల కమిటీకి బహిరంగ లేఖ రాశారు బిసిసిఐ అధ్యక్షుడు సికె ఖన్నా. పాండ్యా, రాహుల్‌ వివాదంపై పదిరోజుల్లో ప్రత్యేక జనరల్‌ సమావేశం జరపడానికి ఆయన నిరాకరించారు. సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని స్వీకరించి అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసేవరకు ఈ విషయంలో ఎలాంటి సమావేశాలు జరపలేం, పాండ్యా, రాహుల్‌ పొరపాటు చేశారు దానికి వారిద్దరినీ ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. అంతేకాక దీనిపై వారు క్షమాపణలు కూడా కోరారు.

విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిద్దరినీ ఇండియన్‌ జట్టులోకి తీసుకోవాలి. దీంతోపాటు మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లకూ వారిని అనుమతించాలి అంటూ పాలకుల కమిటీ ఉన్నతాధికారులకు ఖన్నా లేఖ రాశారు. కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలో పాండ్యా, రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై వీరిద్దరినీ సస్పెండ్‌ చేశారు. ఈ కారణంగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఇద్దరూ దూరమయ్యారు. అయితే ఈ ఇద్దరి భవితవ్యాన్ని తేల్చడానికి అంబుడ్స్‌మన్‌ను నియమించాలంటూ పాలకుల కమిటీ సుప్రీంకోర్టును కోరింది.