అంతర్జాతీయ యువజన సదస్సులో ప్రముఖ క్రీడాకారులు

SMTV Desk 2019-01-20 17:56:28  International youth leadership conference in hyderabad, HICC, Minister Kavitha, Pullela gopinchand, Babita poget, Malavat poorna

హైదరాబాద్, జనవరి 20: వరుసగా రెండో రోజు హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో ఈ రోజు పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రెజ్లర్ బబితా కుమారి పోగోట్, పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ తదితరులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు ఫిజికల్ లిటరసీ కల్పించాలన్నారు. ఆట వ్యక్తికి, ప్రాంతానికి, సమాజానికి, తెగకు పేరు తెచ్చిపెడుతుందని గోపిచంద్ అభిప్రాయపడ్డారు. అలాగే ఆటలు, కళలు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తాయన్నారు. ప్రభుత్వాలు క్రీడలకు కేటాయించే నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం బబితా పోగొట్ మాట్లాడుతూ కరణం మల్లీశ్వరి వొలింపిక్ పతకం సాధించినప్పుడు మాలో ఆలోచన కలిగిందని తమకు స్పూర్తి మా నాన్నే అన్నారు. వారి అంకితభావం, మేం పడ్డ శ్రమ, మీ ప్రేమే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించిందన్నారు. దంగల్ సినిమాలో చూపించిన దానికన్నా మరింత కఠినంగా మా నాన్న శిక్షణ ఇచ్చారు. దాని ఫలితమే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించిందని ఆమె గుర్తు చేశారు. ఏ రంగంలో అయినా రాణించాలంటే క్రమశిక్షణ చాలా అవసరం, చుట్టూ ఉన్న సమాజం వ్యతిరేకించినా, మనలో ఉన్న సంకల్పం, ఆత్మవిశ్వాసమే మనల్ని గెలిపిస్తుందన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను అతిసున్నితంగా పెంచకుండా,వారికి ధైర్య సాహసాలు నూరిపోయాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. సినిమాల్లో చూపించినట్లుగానే శిక్షణ అబ్బాయిలతో కలిసి చేశాం.. దాంతో మా నైపుణ్యం, సామర్ధ్యం పెరిగిందన్నారు.

మాలావత్ పూర్ణ మాట్లాడుతూ ప్రతి వొక్కరి జీవితాల్లో ఆటలు భాగం కావాలన్నారు. అవి ఆరోగ్యంతో పాటు జీవితాన్నిస్తాయని తన విషయంలో అదే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సరదాగా నేర్చుకున్న రాక్ క్లయింబింగ్ తన జీవితాన్నే మార్చేసిందన్నారు. భువనగిరిలో తన కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించినప్పుడు ఎవరెస్ట్ అధిరోహిస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కోచ్ తనలో ఆత్మస్థైర్యం నింపారని, కొండలు ఎక్కేటప్పుడు భయంతో ప్రారంభమైన అడుగు శిక్షణ పూర్తయ్యాక పూర్తి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించిందన్నారు. తన ప్రయాణం ఇక్కడితో ఆపనని అన్ని ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనేదే తన సంకల్పమన్నారు.