అందుకే కేసీఆర్ ర్యాలీకి వెళ్ళలేదు....!

SMTV Desk 2019-01-20 12:47:46  KCR, Mamata benarjee united india ryali, United india, MP Kavitha

హైదరాబాద్, జనవరి 20: శనివారం కోల్ కత్తాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్వహించిన యునైటెడ్ ఇండియా భారీ ర్యాలిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం వచ్చినా కాని కేసీఆర్ హాజరు కాలేదు. అయితే ఈ ర్యాలీకి హాజరు కాకపోవడానికి గల కారణాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందు వల్లనే కేసీఆర్ ఆ ర్యాలీకి హాజరు కాలేదని కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు సందర్భంగా ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.





శానససభ సమావేశాలు తమ పార్టీకి అత్యంత ప్రధానమైనవని కవిత అన్నారు. బిజెపి, కాంగ్రెసులతో సంబంధం లేకుండా అటువంటి ర్యాలీల్లో భవిష్యత్తులో తమ పార్టీ పాల్గొంటుందని ఆమె చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులను చూస్తే వారు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెసు, బిజెపిలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందువల్ల కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించారని ఆమె చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పటికీ సరైన నిర్ణయం జరగలేదని, అయితే ఎన్నికలకు ముందు పొత్తులు కచ్చితంగా ప్రధానమైన పాత్ర పోషిస్తాయని, ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తులు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొనసాగాలని ఆమె అన్నారు.