సోమవారం మాజీ మంత్రి నిరాహార దీక్ష

SMTV Desk 2019-01-19 20:10:37  Thadepally constituency MLA Manikyalarao, TDP,

తాడేపల్లిగూడెం, జనవరి 19: సోమవారం నాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోవడంతో మాణిక్యాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తన నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీలను చంద్రబాబు నీళ్లొదిలేశారని ఆరోపించారు. ఆటో మొబైల్ రంగానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఆటోనగర్ నిర్మాణం, విమానాశ్రయ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు వంటి కీలక హామీలను నెరవేరుస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా స్థానిక టీడీపీ నేతల వొత్తిడితో చంద్రబాబు నిలిపి వేయడం దారుణమన్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. స్థానిక టీడీపీ నేతల కుతంత్రాలు కారణంగానే నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు కావాలనే అమలు చేయడం లేదని విమర్శించారు. సోమవారాన్ని పోలవరంగా మార్చానని చెప్తున్న చంద్రబాబు ఏ పనీ చేయకుండా ఈ జిల్లాపై ఎందుకు క‌క్ష గట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా ప్రజలు అన్ని నియోజకవర్గాలు గెలిపించి చంద్రబాబుకు ఇస్తే ఈ జిల్లాను వెనుకబడిన జిల్లాగా మార్చేశారంటూ ద్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేయడం వల్లే చంద్రబాబు నాయుడుకు రాజీనామా అల్టిమేటం పంపినట్లు గుర్తు చేశారు. తన అల్టిమేటంపై సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. దీంతో ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

తన నిరవధిక నిరాహారదీక్ష ద్వారా అయినా ఈ జిల్లా, నియోజకవర్గానికిచ్చిన హామీలు సీఎం నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను చేపట్టబోయే దీక్షకు ప్రజలంతా అండగా నిలవాలని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ఎమ్మెల్యే మాణిక్యాలరావు గత ఏడాది డిసెంబర్ 25న చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోవడాన్ని నిరసిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో 15 రోజుల్లో అమలు చెయ్యకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని అల్టిమేటం జారీ చేశారు. 15 రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని లేని పక్షంలో తాను నిరవధిక దీక్ష చేస్తానని హెచ్చరించారు. అయితే మాణిక్యాలరావు అల్టిమేటంపై చంద్రబాబు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడంతో ఆయన ఈనెల 21 నుంచి నిరవధిక దీక్షకు దిగుతున్నారు.

అయితే మాణిక్యాలరావు అన్నట్లుగానే నిరవధిక దీక్షకు దిగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇకపోతే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల పొత్తులో భాగంగా తాడేపల్లి నియోజకవర్గాన్ని మాణిక్యాలరావుకు కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాణిక్యాలరావు విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినేట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడంతో చంద్రబాబు నాయుడు కేబినేట్ లో మంత్రులుగా ఉన్న మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉంటూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిగా మాణిక్యాలరావును చెప్తుంటారు.