జగన్ హత్యాయత్నం కేసులో వైసీపీ నేతలు...!!!

SMTV Desk 2019-01-19 19:28:27  YS Jagan mohan reddy attempt to murder case, Vishakhapatnam airport, NIA, YSRCP Leaders Interrogation

విశాఖపట్నం, జనవరి 19: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఇదివరకే ఈ కేసు ప్రధాన నిందితుడైన శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ తాజాగా వైసీపీ నేతలను టార్గెట్ చేసింది. వైసీపీ నేతల విచారణలో ఎన్ఐఏ అధికారులు వారి నుండి కీలక క్లూ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ పై దాడి జరిగిన సమయంలో జగన్ వెంట ఉన్న వైసీపీ నేతలను విచారిస్తున్నారు. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కత్తితో దాడి జరిగిన సమయంలో ఆయన వెంట ఉన్న 9 మంది కీలక నేతలను ఎన్ఐఏ విచారిస్తోంది.

విశాఖపట్నంకు చెందిన మళ్ల విజయప్రసాద్ నివాసంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, మళ్ల విజయప్రసాద్, జియ్యాని శ్రీధర్, తైనాల విజయ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజు, రాజీవ్ గాంధీ, తిప్పల నాగిరెడ్డిలను ఎన్ఐఏ అధికారి వెంకటాద్రి నేతృత్వంలో అధికారుల బృందం విచారణ చేపట్టింది. దాడి ఎలా జరిగింది, నిందితుడు కత్తిని తీసుకుని ఎలా వచ్చాడు, కత్తిని వైసీపీ నేతలు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, షర్ట్ ఎందుకు తీసుకెళ్లారు అనే అంశాలపై ఎన్ఐఏ బృందం ఆరా తీస్తుంది.