వైఎస్ షర్మిల కేసులో 15 మంది నిందితులు...!

SMTV Desk 2019-01-19 18:31:43  YS Sharmila, Social media, Controversy case, Cyber crimes

హైదరాబాద్, జనవరి 19: వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన అసభ్యకర వార్తలపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దూకుడు పెంచారు. ఇందుకు సంబంధించి యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకులను పోలీసులు గుర్తించారు. అవి ఏయే యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో పడ్డారు. ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యులను గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్టేషన్ కు తిసుకుని వచ్చి విచారించారు.

ఆ తర్వాత నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. వారు సొంతంగా యూట్యూబ్‌ చానల్స్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరికొందరిని విచారించాలని నిర్ణయించారు. ఆయా చానల్స్‌లో ఉన్న 60 వీడియోలకు దిగువన అనేక మంది అభ్యం తరకరంగా కామెంట్స్‌ చేశారు. వీడియో పోస్ట్‌ చేసిన వారితోపాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులవుతారని అంటున్నారు. వ్యాఖ్యలు చేసిన వారి ఐడీలను గుర్తిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా యూట్యూబ్‌కు లేఖలు రాస్తున్నారు.