ఆర్మీ పోలీస్ విభాగంలో మహిళలకు ప్రవేశం..

SMTV Desk 2019-01-19 13:34:08  Defence Ministry, Nirmala Sitharaman, women, jawans

న్యూఢిల్లీ, జనవరి 19: ఆర్మీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీసు శాఖలో మహిళల శాతాన్ని 20కి పెరిగేలా యత్నిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మేరకు రక్షణమంత్రి ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్ చేశారు. మిలటరీలో లైంగిక దాడులు, వేధింపుల వంటి తదితర కేసులను సంపూర్ణంగా పరిష్కరించేందుకు వారి సేవలు ఉపయోగపడతాయని భావిస్తున్నామన్నారు. సేవారంగాల్లోకి ఎక్కువమంది మహిళలను తీసుకురావాలనే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంలో భాగంగా రక్షణ దళాలలో మహిళాశక్తిని పెంచాలని నిర్ణయించారు.

ఈ సందర్బంగా దాదాపు 800 మంది మహిళలకు మిలటరీ పోలీస్ విభాగంలో ప్రాతినిధ్యం కల్పించాలని రక్షణ శాఖ భావిస్తోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఎదుర్కొనేందుకు ఆర్మీలోమహిళా జవానుల అవసరం అధికంగా కనుపడుతోంది. ఈ నేపథ్యంలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు గత ఏడాది ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్మీలో మహిళలు విద్య, వైద్యం, న్యాయసేవలు, సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఇక మిలటరీ పోలీస్ విభాగంలో కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు.