'యాత్ర'లో అనసూయ పాత్ర ఇదే..

SMTV Desk 2019-01-19 12:41:19  Anasuya, Anchor, Yatra movie, MLA Character

హైదరాబాద్, జనవరి 19: బుల్లితెరపై యాంకర్ గా సందడి చేస్తున్న అనసూయ వెండి తెరపై కూడా అల్లరి చేస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంటుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ఆమె రంగమ్మత్తగా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అలాంటి అనసూయ ప్రస్తుతం యాత్ర సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో అనసూయ వొక కీలక పాత్రను పోషిచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై రూపొందిన ఈ సినిమాలో అనసూయ ఎవరి పాత్రలో కనిపించనుందనే విషయంపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె ఓ ఎమ్మెల్యే గా కనిపించనుందనేది తాజా సమాచారం.

ఈ నేపథ్యంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రలో అనసూయ కనిపించనుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? .. అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషి .. మొదలైన విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారట. వైఎస్ పాత్రలో మమ్ముట్టి .. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.