చంద్రబాబు పై కేటీఆర్ కౌంటర్స్

SMTV Desk 2019-01-18 19:34:32  KTR, TRS, Chandrababu, Onteru prathap reddy, Congress party senior leader, BJP

హైదరాబాద్, జనవరి 18: ఈ రోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వొంటేరు ప్రతాప్ రెడ్డి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెరాస కండువా కప్పుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీయం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు అక్కసుతో టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని, ఏపీ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ఏనాడూ అడ్డుపడలేదన్నారు. అంతేకాక హైద్రాబాద్‌లో నివాసం ఉంటున్నసీమాంధ్రులు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టారని చెప్పారు. రాగద్వేషాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసినందునే తమకు ఓట్లు వేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎవరు గద్దల్లా ఏపీలో వాలుతున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలో నాలుగున్నర ఏళ్లుగా ఏం చేశారో చెప్పుకొనేందుకు చంద్రబాబునాయుడుకు ఏం లేదన్నారు. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకొనే పరిస్థితి బాబుకు లేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేయలేక చంద్రబాబునాయుడు తన అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకు టీఆర్ఎస్‌పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

అంతేకాక మోడీతో, టీఆర్ఎస్‌తో మధ్య ఎలాంటి సంబంధాలు లేవని మోడీతో పొత్తు పెట్టుకొన్న పార్టీ టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కోల్పోయేలా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏపీపై విమర్శలు చేశామని, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏపీపై విమర్శలు చేయలేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాల్సిన అవసవరం ఉందన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదన్నారు. బీజేపీ పరిస్థితి కూడ అదే రకంగా ఉందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశానికి నష్టం చేశాయన్నారు. ఎన్డీఏకు 150 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదన్నారు. యూపీలో ఎస్పీ, బిఎస్పీ పొత్తు పెట్టుకొన్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తాము సమాన దూరంలో ఉన్నామని ఈ రెండు పార్టీలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వొడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడ ఈ రెండు పార్టీలకు దూరంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకొందన్నారు.