అమిత్‌ షా ఆరోగ్యంపై కాంగ్రెస్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..

SMTV Desk 2019-01-18 16:13:40  congress MP, BK Hariprasad, Controversial comments, Amit Shah, Swine Flu

బెంగళూరు, జనవరి 18: కర్ణాటక కాంగ్రెస్‌ ఎంపీ బీకే హరిప్రసాద్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం వల్లే అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ సోకిందని ఎద్దేవా చేశారు. బెంగళూరులో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివచ్చారు. దీంతో అమిత్‌ షాకు జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరం కాదు.. స్వైన్‌ ఫ్లూ జ్వరం. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తే కేవలం స్వైన్‌ ఫ్లూనే కాదు.. వాంతులు, విరేచనాలు వస్తాయని అర్ధం చేసుకోవాలి అని అన్నారు. దాంతో బీజేపీ నాయకులు రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, పీయూష్‌గోయల్‌తో పాటు పలువురు నేతలు హరిప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. ఫ్లూ జ్వరానికి చికిత్స ఉందనీ, కానీ హరిప్రసాద్‌కున్న మానసిక అనారోగ్యాన్ని తగ్గించడం కష్టమని గోయల్‌ విమర్శించారు.

ఇక ఈ విషయమై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. బీజేపీ నేతల అనారోగ్యాన్ని కాంగ్రెస్‌ ఎప్పటికి కోరుకోదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైట్లీ కోలుకోవాలని కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అమిత్‌ స్వైన్‌ఫ్లూ జ్వరంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం చేరిన సంగతి తెలిసిందే.