వచ్చే నెల నుండి తెలుగు చానల్స్ బంద్

SMTV Desk 2019-01-18 16:13:28  TV Channels, Tray, DTH, Telugu channels

తెలంగాణ, జనవరి 18: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల 1 నుండి టీవీలో తెలుగు చానళ్లను నిలిపివేయనున్నట్లు లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీఓ), మల్టీపుల్ సిస్టమ్ ఆపరేటర్ల సంఘం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రకటించింది. ట్రాయ్ నిబంధనపై భవిష్యత్ కార్యాచరణ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావాల్సిన ఛానెల్‌ను ఎంచుకుని దానిని కొనుక్కోవాలి. ఇతర ఛానెల్స్‌తో పోలిస్తే తెలుగు ఛానెల్స్ ఎక్కువ ధర చెబుతున్నాయని వారు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెను భారం పడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు.

కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే 200 నుంచి 300 ఛానెల్స్ అందిస్తున్నారని ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా ప్రేక్షకులపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారని అయితే ట్రాయ్ నిబంధనల కారణంగా పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఛానల్స్ అన్ని ఫ్రీ టూ ఎయిర్ అయ్యే వరకు సమయం లేదన్నారు. పే ఛానల్స్‌ను చూడటం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని ప్రజలకు సూచించారు. టారిఫ్ విధానంపై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పే ఛానల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కన్నడ ఛానెల్స్ ప్యాక్ రూ.30కే అందిస్తుండగా తెలుగు ఛానెల్స్ వొక్కో దానిని రూ.7 నుంచి రూ.10కి పైన వసూలు చేస్తున్నాయని తెలిపారు. గతంలో 40 తెలుగు ఛానెల్స్‌ను వొక్కో దానిని రూ.12కే అందించేవారని, అయితే ఇప్పుడు కొత్త విధానంలో వొక్కో ఛానెల్‌ను రూ.19కి ప్రేక్షకుడు కొనాల్సి వస్తుందని ఈ విధానాన్ని నిరసిస్తూ ఇప్పటికే బ్రాడ్‌కాస్టర్లకు లేఖలు రాశామన్నారు.