భారత్ కు అమెరికా సూచన

SMTV Desk 2017-07-30 15:18:10  UTHARA KORIYA, AMERIKA, INDIA, CHAINA, Food, drugs, ExportsKim Jong Un,

ఉత్తర కొరియా, జూలై 30 : ఉత్తర కొరియా వైఖరిని అడ్డుకునేందుకు చైనాతో ఇప్పటికే మాట్లాడి ఓ ఒప్పందానికి వచ్చిన అమెరికా, ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఉత్తర కొరియాకు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన భారత్ ఆహార, ఔషధాలను ఆ దేశానికి అత్యధికంగా అందిస్తోంది. ఇక ఉత్తర కొరియాకు ఇండియా నుంచి ఎగుమతులు ఆపేయగలిగితే, మరింత త్వరగా ఫలితాలను సాధించవచ్చని భావిస్తున్న అమెరికా, ఈ దిశగా ఉపఖండం నుంచి కిమ్ జాంగ్ ఉన్ దేశానికి అందుతున్న సహాయాన్ని ఆపించేందుకు అడుగులు వేస్తోంది. ఇదీలా ఉండగా శుక్రవారం రోజున ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో, మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, అమెరికా సైతం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, 2016 లో ఉత్తర కొరియాకు 110 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి. ఆ ముందు సంవత్సరంతో పోలిస్తే, ఇది 30 శాతం తక్కువ. ఇదే సమయంలో నార్త్ కొరియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఆహార, ఔషధ ఉత్పత్తులు మినహా ఉత్తర కొరియాకు మరేమీ ఎగుమతి చేయరాదని భారత్ నిర్ణయించుకుంది. ఇక వీటిని కూడా నిలుపుదల చేయిస్తే, కిమ్ పై మరింత ఒత్తిడిని పెంచవచ్చన్నది అమెరికా ఆలోచనగా స్పష్టం అవుతుంది.