శత్రుఘ్న సిన్హాపై మోదీ ఫైర్..

SMTV Desk 2019-01-17 17:50:00  Shatrughan Sinha, sushil kumar modi, Narendra modi, Bihar, BJP

పాట్నా, జనవరి 17: బీజేపీ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హా పలు సందర్భాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ శత్రుఘ్న సిన్హాకు షాక్‌ ఇచ్చారు. భాజపాతో ఏమైనా ఇబ్బందులుంటే సిన్హా పార్టీ నుంచి తప్పుకోవాలని, ఆయన బీజేపీ అసంతృప్త నేత యశ్వంత్‌ సిన్హా ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. పార్టీపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతున్న విధానం, ఆయన ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు.

శత్రుఘ్న సిన్హాకు పార్టీతో విభేదాలు వుంటే రాజీనామా చేయాలని సుశీల్‌ మోదీ సూచించారు. మోదీ మాట్లాడుతూ.. ‘అసలు ఆ‍యన పార్టీలో ఎందుకుండాలి..పార్టీని దూషిస్తూ బీజేపీలో ఉన్నానని ఎలా చెబుతా రని ప్రశ్నించారు. పార్టీ సీనియర్‌ నేతలుగా చలామణి అవుతున్న యశ్వంత్‌, శత్రుఘ్న సిన్హాలు తరచూ బీజేపీ విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని కేవలం ముందస్తు ప్రణాళికతో కూడిన ఇంటర్వ్యూలు ఇవ్వడం మినహా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు నేరుగా అడిగే ప్రశ్నలకు బదులివ్వలేరని సిన్హా ఇటీవల ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వన్‌మాన్‌ షోలా తయారైందని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సుశీల్ మోదీ పై విధంగా స్పందించారు.