అరుదైన ఘనత సాధించిన భారత పర్వతాధీరోహకుడు..

SMTV Desk 2019-01-17 15:33:20  Satyarup siddhanta, Mountaineer, Record, Antarcticas highest peak, Sidle Volcano

కోల్‌కతా, జనవరి 17: భారత దేశ పర్వత అధిరోహకుడు సత్యరూప్‌ సిద్ధాంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. సత్యరూప్‌ అతి చిన్న వయస్సులోనే ఏడు ఖండాల్లోని ఎతైన పర్వతాలు అధిరోహించిన వ్యక్తిగా రికార్డ్ కి ఎక్కారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.28 గంటలకు అంటార్కిటికాలోని 4,285 మీటర్ల ఎతైన సిడ్లే అగ్ని పర్వతాన్ని అధిరోహించడం ద్వారా సత్యరూప్‌ ఈ ఘనత సాధించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన డానియల్‌ బుల్‌ 36 ఏళ్ల 157 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించారు.

అయితే, సత్యరూప్‌ 35 ఏళ్ల 274 రోజుల వయస్సులోనే ఈ రికార్డును బద్దలు కొట్టారు. ఆయన 2012 నుంచి 2019 మధ్య కాలంలో ఎతైన పర్వతాలు, అగ్ని పర్వతాలు అధిరోహించారు. సిడ్లే శిఖరానికి చేరుకున్న తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించినట్టు సత్యరూప్‌ తెలిపారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కూడా సత్యరూప్‌ సిద్ధాంత్‌ కావడం విశేషం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సత్యరూప్‌ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.